జోహన్నెస్‌బర్గ్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 240 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తెంబా బవుమా(23) అతడికి సహకారం అందించాడు. భారత బౌలర్లలో షమీ, ఠాకూర్, అశ్విన్ తలో వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సారథి ఎల్గర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ టెస్టులో భారత్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు ఆలౌటైంది. బదులుగా సౌతాఫ్రికా 229 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసిన టీమ్ ఇండియా.. దక్షిణాఫ్రికా ముందు 240 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో టెస్టు కేప్ టౌన్ వేదికగా జనవరి 11 నుంచి జరగనుంది.