ఓ వైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ ఉద్ధృతి తీవ్రమవుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో దేశంలోని పలు ప్రాంతాల్లో కొత్త ఆంక్షలను విధిస్తున్నారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలను తెలుసుకోనున్నారు.
కరోనా పరిస్థితిపై గురువారం సాయంత్రం 4.30 గంటలకు సీఎంతో మోదీ కీలక సమావేశం నిర్వహించనున్నారని సమాచారం. ఆదివారం (జనవరి 9) జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలోనూ కొవిడ్ పరిస్థితిపై మోదీ చర్చించారు. జిల్లా స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. కరోనాను నిలువరించేందుకు టీకానే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు.
ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు దేశంలోని ఆరోగ్యకర్తలు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు పంపిణీని ఇప్పటికే ప్రారంభించింది కేంద్రం. 15-18 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు అందిస్తోంది. 2020లో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు ప్రధాని. వైరస్ కట్టడికి చర్యలపై చర్చిస్తున్నారు. ఇవాళ జరిగే సమావేశంలో లాక్ డౌన్ అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తుంది.