IPL 2022: బలమైన ఓపెనింగ్​ జోడీ ఏది?

0
124

ఐపీఎల్​ మెగా వేలం పూర్తైంది. ఇక ఇప్పుడు తుది జట్లలోకి ఎవరిని తీసుకోవాలనే విషయమై కసరత్తులు చేయాలి జట్లు. ఈ నేపథ్యంలో ఆయా జట్లలో ఓపెనర్లుగా ఎవరున్నారు? బలమైన ఓపెనింగ్​ జోడీ ఏది అనేది ఇప్పుడు చూద్దాం..

చెన్నై సూపర్‌ కింగ్స్ : గత సీజన్‌లో రుతురాజ్‌-డుప్లెసిస్‌ జోడీ టాప్‌ స్కోరర్లుగా రాణించడం వల్ల సీఎస్కే కప్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈసారి డుప్లెసిస్‌ స్థానంలో రుతురాజ్‌కు తోడుగా రాబిన్‌ ఉతప్ప, డేవన్‌ కాన్వే, మొయిన్‌ అలీని ఓపెనింగ్‌కు పంపే వెసులుబాటు ఉంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: మొన్నటి వరకు బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్‌, వృద్ధిమాన్‌ సాహా, జాసన్‌ రాయ్ వంటి ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురూ ఎస్ఆర్‌హెచ్‌ క్యాంపస్‌లో లేరు. రాహుల్‌ త్రిపాఠి, నికోలస్‌ పూరన్‌, మార్‌క్రమ్‌, గ్లెన్‌ఫిలిప్స్‌ వంటి వారితో ఓపెనింగ్‌ ప్రయత్నించొచ్చు.

దిల్లీ క్యాపిటల్స్‌ : ఒక వైపు పృథ్వీ షా ఫిక్స్‌. ఇప్పుడు డేవిడ్ వార్నర్‌ను దిల్లీ క్యాపిటల్స్‌ తీసుకోవడం వల్ల ఓపెనింగ్ సమస్య అయితే లేదు. వీరిద్దరికి బ్యాకప్‌గా కేఎస్‌ భరత్‌, సర్ఫ్‌రాజ్‌ ఖాన్, అశ్విన్‌ హెబ్బర్‌ను ఉంచుకోవచ్చు.

గుజరాత్ టైటాన్స్‌ : హార్దిక్‌ పాండ్య, రషీద్‌ ఖాన్, శుభ్‌మన్‌ గిల్‌ను రిటెయిన్ చేసుకున్న గుజరాత్‌ టైటాన్స్​కు ఓపెనర్లు ఎవరనే సందిగ్దత లేదు. గిల్‌తోపాటు జాసన్ రాయ్‌, డేవిడ్ మిల్లర్‌, వృద్ధిమాన్‌ సాహా ఓపెనర్లుగా దిగే అవకాశం ఉంది.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ : ఎప్పుడు ఎలాంటి ప్రయోగాలు చేస్తుందో తెలియని జట్టు కేకేఆర్‌. గత సీజన్లలో కొన్నిసార్లు వెంకటేశ్‌ అయ్యర్‌, సునిల్‌ నరైన్‌, నితీశ్ రాణా, గిల్, త్రిపాఠితో ఓపెనింగ్‌ చేయించింది. ఇప్పుడు నరైన్‌, రాణా, వెంకటేశ్ అయ్యర్‌ జట్టులో ఉన్నారు

లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ : ప్రస్తుతం ఉన్న ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో ఓపెనింగ్‌ కొరత లేని జట్లలో లఖ్‌నవూ ఒకటి. ఆ జట్టు సారథి కేఎల్‌ రాహుల్‌ ఎలానూ ఓపెనర్‌గా వస్తాడు. ఇక రెండో వైపు క్వింటన్‌ డికాక్‌, మనన్‌ వోహ్రా, ఎవిన్‌ లూయిస్‌ వంటి ఆప్షన్లు ఎల్‌ఎస్‌జీకి ఉన్నాయి.

ముంబయి ఇండియన్స్‌ : ఐదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌కు ఓపెనింగ్ సమస్యే లేదు. భారీ ధర వెచ్చించి మరీ తమ వద్దే ఉంచుకున్న ఇషాన్‌ కిషన్‌ తోడుగా కెప్టెన్ రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ చేసేస్తాడు. పాత కూర్పుతోనే ఓపెనింగ్‌ చేస్తారా.. కొత్త ఆటగాళ్లను తయారు చేసుకుని బరిలోకి దింపుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

పంజాబ్‌ కింగ్స్‌ : పేరులోనే కింగ్స్‌ ఉన్నట్లు.. పంజాబ్‌కు ఓపెనింగ్‌ బెడద లేదు. మయాంక్‌ అగర్వాల్‌, శిఖర్ ధావన్‌, బెయిర్‌స్టో, లివింగ్‌ స్టోన్‌ వంటి హేమాహేమీలు ఆ జట్టు సొంతం. మిడిలార్డర్‌లో షారుఖ్‌ ఖాన్‌, ఓడియన్‌ స్మిత్, భనుక రాజపక్స, నాథన్‌ ఎల్లిస్‌ తదితరులు రాణించగలిగే సత్తా ఉన్నవాళ్లే.

రాజస్థాన్‌ రాయల్స్‌ : కెప్టెన్‌ సంజూ శాంసన్, జోస్‌ బట్లర్‌, యశస్వి జైస్వాల్, దేవదుత్‌ పడిక్కల్‌ వంటి మంచి ఆరంభాన్నిచ్చే బ్యాటర్లను కలిగిన ఏకైక జట్టు రాజస్థాన్‌. బట్లర్‌-జైస్వాల్‌, జైస్వాల్‌-పడిక్కల్‌, జైస్వాల్‌-సంజూ.. ఇలా కాంబినేషన్లతో ఓపెనింగ్‌కు దిగే వెసులుబాటు రాజస్థాన్‌కు ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : అగ్రశ్రేణి ఆటగాళ్లకు కొదవలేదు. విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌కు ఇప్పుడు డుప్లెసిస్‌, దినేశ్ కార్తిక్‌, డేవిడ్‌ విల్లే, వనిందు హసరంగ, ఫిన్‌ అలెన్‌ తోడయ్యారు. గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున ఓపెనర్‌గా డుప్లెసిస్‌ అత్యధిక పరుగుల జాబితాలో రెండో ఆటగాడు. విరాట్ కోహ్లీ ఎలాగూ ఓపెనింగ్ చేయగలడు.