ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ మృతి..యావత్ క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. థాయ్లాండ్ విహారంలో ఉన్న షేన్ వార్న్ శుక్రవారం తన విల్లాలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో తెలిపిన వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ తాజాగా మరో విషయాన్ని తెలిపారు.
ఒక రోజు ఛాతి వద్ద నొప్పిగా ఉందని, చెమటలు పడుతున్నాయని వార్న్ చెప్పారని మేనేజర్ ఎర్స్కిన్ తెలిపారు. సాధారణంగా వార్న్ ఎక్కువగా సిగరెట్లు తాగుతారని ఎర్స్కిన్ అన్నారు. అందుకే అది గుండెపోటే అయి ఉంటుందని, ఇంకా వేరేది ఏం కాదన్నారు. బరువు తగ్గేందుకు 14 రోజుల డైట్ కూడా చేస్తున్నారని తెలిపారు. దీనిపై కొద్ది రోజుల ముందు వార్న్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారు.
కాగా వార్న్ మరణంలో అనుమానాస్పద సూచనలేమీ లేవని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని థాయ్లాండ్ పోలీసులు తెలిపారు. శవపరీక్షలో కూడా సహజ కారణాల వల్లే వార్న్ మృతిచెందినట్లు స్పష్టమైందని వెల్లడించారు. కాగా వార్న్ 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారు. టెస్టుల్లో 5 వికెట్లు 37సార్లు, 10 వికెట్లు పది సార్లు తీశారు.