క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజరాత్ తో పాటు లక్నో రెండు ఫ్రొంచైజీలు ఆడబోతున్నాయి. మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి. ఒక్క బెంగళూరు తప్ప మిగతా అన్ని టీంలు కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి. తాజాగా ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయింది.
గత సీజన్లో ఛాంపియన్స్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్‌గా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్‌లను ఆడాలి. దీంతో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవే కాకుండా ఫైనల్‌తో కలిపి నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఉంటాయి.
తాజాగా ఐపీఎల్ జట్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఉన్న డీఆర్ఎస్ నిబంధన విషయంలో పలు మార్పులు చేసింది. గతంలో ఒక్క ఇన్నింగ్స్ లో ఒక జట్టుకు కేవలం ఒక్క డీఆర్ఎస్ అవకాశం ఉండేది. అది విఫలం అయిన తర్వాత.. ఆ జట్టు తిరిగి రివ్యూ తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు బీసీసీఐ తీసుకువచ్చిన నూతన మార్పుల ద్వారా ఇక ఇన్నింగ్స్ లో ఒక జట్టుకు రెండు డీఆర్ఎస్ అవకాశాలు ఉండనున్నాయి.