క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజరాత్ తో పాటు లక్నో రెండు ఫ్రొంచైజీలు ఆడబోతున్నాయి. మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి. గత సీజన్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్‌గా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ ఈ రోజు రాత్రి 7.30 గంటలకు జరగనుంది.
ఈ పోరుకు ముంబై వాంఖడే స్టేడియం వేదిక అయింది. ఈ రెండు టీమ్స్ ఈసారి కొత్త కెప్టెన్లతో బరిలో దిగబోతుండటం మరో విశేషం. ఇటు చెన్నై, అటు కోల్‌కతా ఇరు జట్లు కొత్త కెప్టెన్లను నియమించాయి. గత సీజన్‌లో కేకేఆర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్‌ను తప్పించి.. అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కి బాధ్యతలు అప్పగించింది. ఇటు చెన్నై కెప్టెన్ ధోనీ కూడా అనూహ్య నిర్ణయం తీసుకుని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా ఎంపిక చేశాడు.
చెన్నై: ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మినహా చెన్నై జట్టులో పెద్ద సమస్యలేం కనిపించడం లేదు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావోలతో బ్యాట్టింగ్ బలంగా కనిపిస్తోంది. డ్వెయిన్ ప్రిటోరియస్, శివమ్ దూబె వంటి హిట్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఆడమ్ మిల్నె, మహేశ్ తీక్షణ, రాజవర్థన్ హంగార్గేకర్ తదితరలతో పేస్ విభాగం మెరుగ్గానే ఉంది. మొయిన్ అలీ, దీపక్ చాహర్ తొలి మ్యాచ్ కు దూరం కావడం.
కేకేఆర్: కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్, నితీష్, రస్సెల్, నరైన్, బిల్లింగ్స్ జట్టుకు ప్రధాన బలం. పాట్ కమ్మిన్స్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, శివమ్ మావి, చమిక కరుణరత్నెలతో పేస్ విభాగం పటిష్టంగా ఉంది. వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ నబి వంటి స్పిన్నర్లు కూడా అందుబాటులో ఉన్నారు. కానీ ఈ ఆటగాళ్లు ఏ మేర రాణిస్తారో చూడాలి.