జేసీ సంచలన నిర్ణయం….ఆయన ఎంపీ సీటు ఈసారి ఎవరికంటే…?

జేసీ సంచలన నిర్ణయం....ఆయన ఎంపీ సీటు ఈసారి ఎవరికంటే…?

0
131

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సంచలనం సృష్టించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా… ప్రధాని నరేంద్ర మోడి అయినా తాను అనుకున్నది చెప్పడం ఆయన నైజం. మోడీ హోదా ఇవ్వరు అని చెప్పినా… చంద్రబాబు ఎదుటే సార్ మీ టెలికాన్ఫరెన్సులతో చాలా ఇబ్బందిగా ఉంది అంటూ బహిరంగ వేదిక మీదే చెప్పినా అది జేసినే చేయగలరు. ఆ క్రమంలోనే తాను యాక్టివ్ గా వుండగానే రాజకీయాల నుంచి తప్పుకొనే సాహసం ఏ పొలిటికల్ లీడర్ చేయరు. కానీ అందరిలో జేసీ వేరు కదా. అందుకే రాజకీయ సన్యాసం తీసుకోవాలని నిర్ణయించారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌, టీడీపీ రెండు పార్టీల్లోనూ జేసీ చురుకైన పాత్ర వహించారు. ఎమ్మెల్యేగా మంత్రిగా, ఎంపీగా అనేక పదువులను అలంకరించారు. ఆ పదువులకు వన్నెతెచ్చారు.

అనంతపురం రాజకీయాలను కనుసైగతో శాసించారు. రాజకీయాల్లో తలపండిన జేసీ ఇప్పుడు రాజకీయాలకు గుబ్‌బై చెప్పేస్తున్నారు. అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఏపీపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్తానని వెల్లడించారు. ప్రధాని మోదీని నమ్మితే ఏపీ రాష్ట్రానికి పంగనామాలు పెట్టారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. మోడీ, జగన్‌, పవన్‌పై జేసీ తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. మోడీ ఏపీకి ఏమీ ఇవ్వరని తాను గతంలోనే చెప్పానని అన్నారు. మోడీ అధికారంలోకి రావడానికి సాయం చేసిన చంద్రబాబును ప్రధాని మోసం చేశారని ఆయన విమర్శించారు. ఎవరి ఇంటికైనా పోయి ఒక పూట భోజనం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని.. అలాంటిది మోదీకి చంద్రబాబు ప్రధానమంత్రిని చేస్తే చివరికి పంగనామాలు పెట్టారని జేసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌కు సీఎం పదవిపై తప్ప వేరే ఆలోచన లేదని జేసీ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు పులివెందుల నియోజకవర్గానికి సాగు నీరు ఇచ్చారని అన్నారు. మండు వేసవిలో కూడా కరువు జిల్లా అనంతపురంలో జలకళ వచ్చిందంటే అది చంద్రబాబువల్లేనని జేసీ పేర్కొన్నారు.

సీమ రైతులకు మేలు జరుగుతుంటే… జగన్ పట్టిసీమ వద్దన్నారని ఆయన విమర్శించారు. జగన్ తల్లి గర్భంలోనే ముఖ్యమంత్రి… ముఖ్యమంత్రి అంటూ బయటకు వచ్చారని, ఆయన వెనుక ఇంకొరు ఉన్నారని, ఆయన సినిమా యాక్టరనీ.. ఆయనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఆ మహానుభావుడు మాత్రం తల్లి గర్భం నుంచి బయట పడిన వెంటనే కేర్ మంటూ సీఎం… సీఎం అన్నాడని జేసీ ఎద్దేవా చేశారు. అనంతపురానికి కియా మోటార్స్ రాకుండా ప్రధాని మోదీ విఫలయత్నం చేశారని జేసీ అన్నారు. ఏం మాయ చేశారోగానీ అనంతపురానికి కియా మోటార్స్ వచ్చేటట్లు చంద్రబాబు చేశారని ఆయన కొనయాడారు. ఇక జేసీ తప్పుకొంటే ఆయన వారసుడి రాజకీయ ప్రవేశానికి అంత సిద్ధమైనట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో దివాకర్‌రెడ్డి స్థానంలో ఆయన తనయుడు పవన్‌రెడ్డి నిలబడతారనే ప్రచారం పాకిపోయింది. ఈ విషయంలో ఎంపీ జేసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పవన్‌రెడ్డి జెట్‌ స్పీడుతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. స్విడ్జర్లాండు, జెనీవాలో ఎంబీఏ చదువుకున్న ఆయన హైదరాబాద్‌లో ఉంటూ సినిమా ప్రముఖులు, క్రికెటర్లతో ఆయన పరిచయాలు పెంచుకుంటున్నారు. కొంతకాలంగా అనంతపురంపై దృష్టి సారించారు. నగరంలోని ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేపడుతున్నారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.