RT-PCR mandatory for arrivals from China, Japan, South Korea, Hong Kong and Thailand: కోవిడ్ కొత్త వేరియంట్ కలవరపెడుతోంది. చైనాలో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్, థాయ్ లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులు నెగిటివ్ టెస్ట్ రిపోర్ట్ కలిగి ఉండాలని పేర్కొంది. ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే లేదా పరీక్షలు పాజిటివ్‌గా ఉంటే వారిని క్వారంటైన్‌లో ఉంచుతామని మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు.
రాష్ట్రాలకు ఆరు పాయింట్లతో కూడిన సూచనలు జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గతంలో ఆక్సిజన్ కొరత అతిపెద్ద సమస్యగా తలెత్తిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ నిల్వలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. దేశంలో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తలెత్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి వైద్య మౌలిక సదుపాయాల నిర్వహణ చాలా ముఖ్యమైనది’ అని కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారు. ఆక్సిజన్ ప్లాంట్లను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడమే కాకుండా రెగ్యులర్‌గా పనితీరును నిర్ధారించుకోవాలని పేర్కొన్నారు.