America |అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన శైలేష్(21) దుర్మరణం చెందాడు. నిజామాబాద్ బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతల, సత్యం దంపతుల కుమారుడు శైలేష్ బీటెక్ పూర్తి చేసిన తర్వాత పైచదువుల కోసం గతేడాది అమెరికా వెళ్లాడు. అయితే అతడు కారులో వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో శైలేష్ కారులోని పెట్రోల్ ట్యాంక్ పేలడంతో మంటలు వ్యాపించి సజీవ దహనమయ్యాడు.
న్యూజెర్సీ అధికారులు శైలేష్ కుటుంబ సభ్యులకు ప్రమాద విషయాన్ని తెలియజేయడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా(America) వెళ్లిన కుమారుడు ఇలా తిరిగి రానిలోకాలకు వెళ్లిపోయాడంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. శైలేష్(Shailesh) మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తెప్పించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని బంధువులు విజ్ఞప్తి చేశారు.