ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే నేతల చేరికలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. తాజాగా కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏలూరులోని టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు(Maganti Babu) నివాసానికి వెళ్లారు. ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. తాజా రాజకీయాలపై చర్చించిన ముద్రగడ.. టీడీపీ- జనసేన పొత్తుకు తన మద్దతును తెలియజేశారు.
వైసీపీలో తనకు తవ్ర అన్యాయం జరిగిందని ముద్రగడ ఆవేదన వ్యక్తంచేశారు. కోట్ల రూపాయలు ఇస్తేనే వైసీపీలో సీటు వస్తుందని తమ లాంటి వారికి అన్యాయం జరుగుతుందని ముద్రగడ(Mudragada) వాపోయినట్లు మాగంటి బాబు తెలిపారు. త్వరలోనే ఆయన జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జనసేనలో పార్టీలో చేరిక విషయంపైనే తమ భేటీలో ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. తొందర్లోనే పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో ముద్రగడ భేటీ అవుతారని మాగంటి వెల్లడించారు. టీడీపీ, జనసేన అధికారంలో వస్తే అందరినీ కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.