తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న అనంతరం ఫిబ్రవరి 27 నుంచి రూ.500లకే గ్యాస్ సిలిండర్‌తో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఉచితం(Free 200 Units) పథకాలను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ రెండు గ్యారంటీల పథకాలను ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని తెలిపారు. ఇక త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
మార్చి మొదటివారం నుంచి జారీచేసే విద్యుత్ బిల్లులకు సంబంధించి అర్హులైన వినియోగదారులకు జీరో బిల్లులు ఇవ్వాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు చెప్పారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు వీలుగా విధివిధానాలను సిద్ధంచేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించిందని.. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందని గుర్తుచేశారు.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ గ్యారంటీలు అందుతాయని క్లారిటీ ఇచ్చారు. కోటిన్నర మంది భక్తులకు పైగా వచ్చే మేడారం జాతరను జాతీయ పండుగగా మార్చాలని కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో వనదేవతలను దర్శించుకోలేదు కాబట్టే ఓడిపోయారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.