ఎన్నికల సమయంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్(Amanchi Krishna Mohan) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. ప్రజల ఆకాంక్షల మేరకే వైసీపీ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 9న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.
కాగా పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న ఆమంచి(Amanchi Krishna Mohan) ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే సీఎం జగన్ మాత్రం టీడీపీ నుంచి పార్టీలో చేరిన యడం బాలాజీకి అవకాశం కల్పించారు. దీంతో తన సొంత నియోజకవర్గమైన చీరాల నుంచి సీటు వస్తుందని భావించారు. అయితే అక్కడ కరణం వెంకటేష్‌కు సీటు ఇచ్చారు. రెండు నియోజకవర్గాల్లో సీటు రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అందుకే కార్యకర్తలతో సమావేశమై పార్టీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయని సన్నిహితులు చెబుతున్నారు. కాగా 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.