మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అవినాష్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించుకుని తన కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
దస్తగిరి పిటిషన్‌పై ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి తన సోదరుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సాక్షులను బెదిరిస్తున్నారని.. తక్షణమే బెయిల్ రద్దు చేయాలని వాదించారు. ఇక సీబీఐ తరుపు న్యాయవాది కూడా అవినాష్(Avinash Reddy) బెయిల్ రద్దు చేయకపోతే విచారణ సరిగ్గా జరగదని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.