వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(Chevireddy Mohith Reddy)ని శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల పోలింగ్ తర్వాత టీడీపీ నేత పులివర్తి నాని(Pulivarthi Nani)పై జరిగిన హత్యాయత్నం కేసులో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దుబాయ్(Dubai) వెళ్తుండగా బెంగళూరు విమానాశ్రయం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తిరుపతి డీఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలోని బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుంది.
ఆదివారం ఉదయం ఆయన్ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు చెవిరెడ్డిని విచారించారు. అనంతరం చెవిరెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. అంతేకాకుండా నోటీసుల ప్రకారం కేసులో ఆయన పాత్ర లేదని తేలేవరకు విదేశాలకు వెళ్లకూడదని వెల్లడించారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే చెవిరెడ్డి(Chevireddy Mohith Reddy).. మీడియాతో మాట్లాడారు. అధికారం వచ్చిందన్న అహంకారంతో విపక్ష పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతోందని, ఆ బాధితుల్లో తానూ ఒకడినని వివరించారు చెవిరెడ్డి. తనపై నమోదు చేసిన కేసు విషయంలో న్యాయస్థానంలో పోరాటం చేస్తానని, మన న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందంటూ వ్యాఖ్యానించారు.