YS Sharmila | ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 61 అసెంబ్లీ, 20 ఎంపీ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. పొత్తు నేపథ్యంలో వామపక్షాలకు కొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది.
కడప ఎంపీగా పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) పోటీ చేయనున్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పల్లంరాజు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా రామ్ పుల్లయ్య యాదవ్ బరిలో దిగనున్నారు. అటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్థర్ నందికొట్కూరు నుంచి.. ఎలీజా చింతలపూడి నుంచి పోటీ చేయనున్నారు. కోడుమూరు నియోజకవర్గం నుంచి వైపీపీ మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణకు అవకాశం ఇచ్చారు.
మొత్తానికి కడప ఎంపీ ఎన్నిక రాష్ట్రంలోనే కీలకంగా మారనుంది. ఎందుకంటే వైయస్ కుటుంబసభ్యులైన షర్మిల కాంగ్రెస్ తరపున, అవినాశ్ రెడ్డి వైసీపీ నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. తన మద్దతు షర్మిలకే ఉంటుందని వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇప్పటికే ప్రకటించగా.. టీడీపీ కూడా పరోక్షంగా షర్మిలకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఎవరు ఎంపీగా విజయం సాధిస్తారనేది ఆసక్తిగా మారింది.