చంద్రబాబు(Chandrababu) హౌస్ కస్టడీ పిటిషన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు హౌస్ అరెస్ట్ కు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టులో పిటిషన్ కి సంబంధించిన వాదనలు ముగిసాయి. ఇరు వర్గాల మధ్య వాదనలు వాడివేడిగా కొనసాగాయి. సిఐడి తరఫున ఏజీ శ్రీరామ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్పెషల్ జీపీ వివేకానంద వాదనలు వినిపించారు. ఇక చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. NSG క్యాటగిరి సెక్యూరిటీ, వివిఐపి గా ఉన్న చంద్రబాబుని భద్రతా కారణాల రీత్యా హౌస్ కస్టడీకి ఇవ్వాలని లూథ్రా(Sidharth Luthra) గట్టిగా వాదించారు. జైల్లో ఉంచితే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని వాదనలు వినిపించారు.
ఆయన వాదనలకు సిఐడి తరపు న్యాయవాదులు గట్టిగా కౌంటర్ వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యంగా, పూర్తి భద్రత మధ్య ఉన్నారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఇంటికంటే చంద్రబాబుకు జైల్లోనే భద్రత ఎక్కువ అని, అందుకే ఆయనను హౌస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన కోర్టుకు వివరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన కేసు తీర్పును చంద్రబాబు కేసు కు ముడి పెట్టొద్దని ఆయన కోరారు. చంద్రబాబు(Chandrababu)ను హౌస్ కస్టడీకి ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సిఐడి తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారు. కాగా, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం మరి కాసేపట్లో చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇవ్వనుంది.