ఏపీ సీఎం జగన్(Jagan)పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి(Bhanuprakash Reddy) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా జగన్ రాజ్యాంగం నడుస్తోందని, ఐపీసీ సెక్షన్లు కాకుండా వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్‌రెడ్డి(Avinash Reddy) అరెస్టు కోసం వచ్చిన సీబీఐ అధికారులను ప్రజాప్రతినిధులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు(Viveka Murder Case) దర్యాప్తు తుది దశకు చేరుకుందన్నారు. హత్య వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు, లబ్ధిదారులు అందరినీ సీబీఐ వదిలిపెట్టదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసిందని.. అవినాష్‌రెడ్డి కోర్టుల్లో పిటిషన్లు వేయడంతో వేచి చూస్తోందన్నారు. అవినాష్‌రెడ్డి అరెస్టుకు ఎమ్మెల్యేలు అడ్డుపడడం సరికాదన్నారు.
ఇండియన్ పోలీస్ సర్వీసును కొందరు అధికారులు ఇండియన్ పొలిటికల్ సర్వీసుగా మార్చివేశారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పరదాల మాటున వెళ్లే ఏకైక ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఛార్జిషీట్ల రూపంలో జగన్‌మోహన్‌రెడ్డి ఫైల్స్ విడుదల చేస్తామని ఆయన(Bhanuprakash Reddy) వెల్లడించారు.