ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరగుతోంది. అన్ని పార్టీల అధినేతలు నువ్వానేనా అనే రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో అంటే ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆరోజు నుంచి ఈనెల 25వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. దీంతో అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు మంచి ముహుర్తాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), సీఎం జగన్(YS Jagan) కూడా తమ నామినేషన్లు వేసే తేదీలను ఖరారు చేశారు.
చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఎనిమిదోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈనెల 19న చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేయనున్నారు. ఆమె చంద్రబాబు(Chandrababu) నామినేషన్ పత్రాలను కుప్పంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. అలాగే సీఎం జగన్ కూడా ఈనెల 25న నామినేషన్ వేయనున్నారు. అంతకుముందే ఈనెల 22న జగన్ తరపున కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఓ సెట్ నామినేషన్ వేయనున్నారు. ఇక టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా ఈనెల 18న నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.