వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. పెనుకొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ తాను ఐటీ ఉద్యోగాలు ఇస్తే.. జగన్ వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తున్నాడంటూ విమర్శించారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించమని స్పష్టం చేశారు. అందుకే వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయవద్దని కోరుతున్నా.. మీకు మంచి భవిష్యత్ ఉంటుందని హామీ ఇచ్చారు.
అలాగే టీడీపీ(TDP) కార్యకర్తలను ఎక్కడికక్కడ వేధిస్తున్నారని.. ఖబడ్దార్… జాగ్రత్తగా ఉండండని వైసీపీ నేతలను హెచ్చరించారు. దెబ్బకు దెబ్బ… మంచికి మంచి.. తమాషా పడొద్దన్నారు. రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తాను, పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీసుకుని ముందకెళ్తున్నామన్నారు. ఇందుకోసం ఎలాంటి త్యాగాలకైనా మేం సిద్ధం… మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లా అంటే తనకు ఎంతో ఇష్టమని కియా పరిశ్రమను తెచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించామన్నారు. కియా వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని చంద్రబాబు(Chandrababu) తెలిపారు.