గత ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఈ ప్రాంత రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మూడు రాజధానులంటూ రాష్ట్ర ప్రజలతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఫలితాలు వెల్లడయ్యే జూన్ 4న జగనాసుర వధతో విజయోత్సవాలు చేసుకుందామని తెలిపారు.
‘‘రాజధాని కోసం 29వేల మంది రైతులు 35వేల ఎకరాలు ఇచ్చారు. రాజధానికి కేంద్రం కూడా సహకరించింది. అమరావతిని కూడా హైదరాబాద్‌లా మారుద్దామని ప్రణాళికలు వేశాం. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నాం. ప్రపంచదేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించా. సంపద సృష్టించే కేంద్రంగా తయారుచేయాలనుకున్నా. జగన్ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు.. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారు. అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరు. అసాధ్యాన్ని.. సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా. మన రాజధాని అమరావతే. విశాఖపట్నం, కర్నూలును అభివృద్ధి చేస్తాం. జగన్ పోవాలి.. ప్రజలు గెలవాలి” అన్నారు.
“జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆ పార్టీ నేతలకు కమిషన్లు ఇవ్వలేక రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయి. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని నిరుద్యోగులను మోసం చేశారు. సీపీఎస్ రద్దు చేయలేదు. ఉద్యోగులకు పీఆర్‌సీ, డీఏలు ఇవ్వలేదు. రూ.కోట్లు ఖర్చు పెట్టినా జగన్ సభలకు జనం రావడం లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనితో పాలన ప్రారంభిస్తారు. కానీ, రూ. 10కోట్లతో కట్టిన ప్రజావేదిక కూల్చివేసి దుర్మార్గుడు పాలన ప్రారంభించారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్ దిగిపోవాలి. రాష్ట్ర ప్రజలకు వైసీపీపై కక్ష తీర్చుకునే అవకాశం వచ్చింది. నేను, పవన్, మోదీ కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తాం’’ అని చంద్రబాబు(Chandrababu) ప్రజలకు భరోసా ఇచ్చారు.