Early Elections in AP |ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్(CM Jagan) స్పష్టత ఇచ్చేశారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని.. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని ఎమ్మెల్యేలకు తెలిపారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, రీజినల్ కో ఆర్డినేటర్లతో జగన్ మీటింగ్ ముగిసింది. 60మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని పుకార్లు ప్రచారం చేస్తున్నారని.. ఆ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. మారీచుల వంటి రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని జగన్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ(TDP) గెలిచింది రెండవ ప్రాధాన్యత ఓట్లతో మాత్రమేనని.. వాపు చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక నుంచి నేతలు ప్రజల్లోని ఉండాలని.. సెప్టెంబర్ కల్లా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తిచేయాలని ఆదేశించారు జగన్.
Early Elections in AP |అయితే వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సమావేశానికి కొందరు ముఖ్యనాయకులు హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజినీ మీటింగ్ కు డుమ్మాకొట్టారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఉమాశంకర్ గణేష్, బాల నాగిరెడ్డి, నవాజ్ బాషా, చింతల రామచంద్రా రెడ్డిలు సైతం గైర్హాజరయ్యారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందువల్లే ఎమ్మెల్యేలు హాజరుకాలేదని వారి అనుచరులు చెబుతున్నారు. ఏది ఏమైనా కానీ ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమైన సమావేశానికి రాకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
Read Also: నిద్రలో గురక పెడుతున్నారా? ఈ సమస్యని చిన్నదిగా చూడకండి..
Follow us on: Google News, Koo, Twitter