ఎన్నికల వేళ వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు(Dadi Veerabhadra Rao), ఆయన కుమారుడు దాడి రత్నాకర్(Dadi Ratnakar) రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత సీఎం జగన్‌కు ఏకవాక్యంతో లేఖ రాశారు. అలాగే తన రాజీనామా కాపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డికి పంపారు. అయితే ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డికి మాత్రం లేఖ పంపించలేదు. రాజీనామా అనంతరం త్వరలోనే టీడీపీ(TDP)లో చేరుతున్నట్లు ప్రకటించారు. రేపు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబుతో భేటీ కానున్నట్లు వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో అనకాపల్లి(Anakapalle) టికెట్‌ను దాడి కుటుంబం ఆశించింది. అయితే అధిష్టానం టికెట్ నిరాకరించడంతో పార్టీ మారాలని భావించారు. ఈ క్రమంలోనే కార్యకర్తలతో చర్చించి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాడి వీరభద్రరావు(Dadi Veerabhadra Rao) రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎన్నికల వేళ అందరూ సీట్లు, టికెట్లు ఆశించడం సహజమని.. అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. పార్టీలో మరో విధంగా ప్రాధాన్యత కల్పిస్తామని వీరభద్రరావుకు చెప్పినా వినలేన్నారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా పార్టీకి నష్టం లేదని స్పష్టం చేశారు. కాగా 2014కు ముందు వరకు దాడి వీరభద్రరావు టీడీపీ(TDP)లోనే ఉన్నారు.