టీడీపీ (TDP) నేతలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (finance minister buggana ) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్నటి వరకు శ్రీలంక అంటూ దుష్ప్రచారం చేసిన టీడీపీ నేతలు.. ఇప్పుడు నైజీరియా, జింబాబ్వే అంటూ నానా యాగీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక.. సర్కారుపై రాళ్లు రువ్వటమే లక్ష్యంగా ప్రతిపక్ష నేతలు వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. పిల్లి శాపాలకు ఉట్లు తెగవని యనమలకు చురకలు అంటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై టీడీపీ చేస్తున్న ఆరోపణలపై ఆర్థిక మంత్రి ప్రకటన విడుదల చేశారు. 2020-21 ఆర్థిక పరిస్థితి గురించే యనమల(yanamala) పదేపదే మాట్లాడుతున్నారనీ.. కరోనాతో ఆదాయ వనరులు గండి పడిందని వివరించారు. అయినప్పటికీ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే.. నవరత్నాలను సైతం అమలు చేసినట్లు స్పష్టం చేశారు. టీడీపీ పాలనలోనే 19.6 శాతం అప్పులు పెరిగితే.. వైసీపీ మూడేళ్ల పాలనలో పబ్లిక్ సెక్టార్ యూనిట్లు తీసుకున్న అప్పులతో కలిపి కేవలం 15.5 శాతం మాత్రమే పెరిగినట్లు ప్రకటించారు. టీడీపీ హయాంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకున్నా.. అప్పులు చేశారని మండిపడ్డారు. యనమల రామకృష్ణుడు చెప్తున్న 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదనీ.. వాటిని గణాంకాలతో రుజువు చేయగలరా అని ప్రశ్నించారు.
Read also: Amnesia: చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారా..?