ప్రత్యక్ష రాజకీయాలకు ఎంపీ గల్లా జయదేవ్(Galla Jayadev) గుడ్ బై చెప్పారు. అయితే రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావట్లేదని, వనవాసం తర్వాత శ్రీరాముడు, పాండవులు తిరిగి వచ్చినంత బలంగా మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెడతానని స్పష్టం చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్న నేపథ్యంలో గల్లా జయదేవ్ ఈరోజు గుంటూరులో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సహచర నేతలను, కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడినందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నా వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నం చేశాయన్నారు. నాకు ఈడీ అధికారుల నుండి బెదిరింపులు వచ్చాయని, అందుకే మూడేళ్ల నుంచి మౌనంగా ఉండిపోవలసి వచ్చిందని ఎమోషనల్ అయ్యారు. మా వ్యాపారాలన్నీ నిజాయితీగా చేస్తున్నప్పటికీ ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుటుంబం కోసం, వ్యాపారాల కోసం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని పేర్కొన్నారు.
ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే..
నాకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు(Chandrababu)కు రుణపడి ఉంటాను. ఎంపీగా రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు. చివరి మూడు సంవత్సరాలుగా నేను క్షేత్ర స్థాయిలో అందుబాటులో లేను. కానీ పార్లమెంట్‌లో గుంటూరు(Guntur) ప్రజలకు ఏం చేయాలో అవి చేస్తూనే ఉన్నాను. మా తాత వారసత్వంగా ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. పదేళ్ల నుండి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నాం. కానీ ప్రయోజనం లేదు. ఈడీ నన్ను రెండు సార్లు పిలిచి విచారించింది. నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయి. సీబీఐ, ఈడీ నా ఫోన్లను ట్యాప్ చేస్తోంది. బీజేపీ చేతికి మట్టి అంటకుండా ఇక్కడ కంపెనీలను జగన్ చేత కూడా టార్గెట్ చేయించారు.
జగన్ పైకి కనబడతాడు, ఢిల్లీ బీజేపీ వాళ్ళు కనబడరు. నేను ఓటమి భయంతో రాజకీయాల నుంచి తప్పుకోవట్లేదు. మళ్లీ పోటీ చేసినా గుంటూరు ప్రజలు నన్ను గెలిపిస్తారనే నమ్మకం ఉంది. కానీ, ఒత్తిళ్ల మధ్య రాజకీయాలు, వ్యాపారం చేయలేను. మా నాన్న గారు రెండేళ్ల క్రితం చనిపోయారు. వ్యాపార భారం కూడా నాపైనే ఉంది. అందుకే వ్యాపారాలపై పూర్తిగా దృష్టి పెట్టాలనే నిర్ణయానికి వచ్చాను. ఈ క్రమంలో రాజకీయాల నుండి విరామం తీసుకుంటున్నాను అని గల్లా జయదేవ్(Galla Jayadev) వెల్లడించారు.