ఏపీ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) రాజీనామా ఆమోదం ప్రక్రియ హాట్ టాపిక్ గా మారింది. ఆయన మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే.. ఎన్నికలకు మూడు నెలలు ముందు స్పీకర్ ఆమోదం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. ఈ వ్యవహారంపై టీడీపీ(TDP) వర్గాలు మండిపడుతున్నాయి. రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే గంటా రాజీనామా కి ఇప్పుడు ఆమోదం ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై గంటా శ్రీనివాసరావు బుధవారం మీడియాతో మాట్లాడారు.
కుట్రలో భాగంగానే తన రాజీనామాను హడావిడిగా ఆమోదించారని అన్నారు. ఆమోదం ఇచ్చే ముందు కనీసం తన వివరణ తీసుకోలేదని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు కోసమే ఇలా చేశారన్నారు. రాజీనామా ఆమోదం విషయంలో కనీస ప్రొసీజర్ ఫాలో కాలేదన్నారు. ఈ విషయంలో తాను న్యాయ పోరాటం చేస్తానని కీలక ప్రకటన చేశారు. వైసీపీ కుట్రను న్యాయపరంగా ఎదుర్కొంటానని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాంట్ పరిరక్షణకు కార్యచరణ రూపొందిస్తామని ఆయన(Ganta Srinivasa Rao) స్పష్టం చేశారు.