ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు(Gidugu Rudra Raju) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) కి పంపించారు. వైఎస్ షర్మిలకి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీలో కాంగ్రెస్ పతనమైంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లైనా పార్టీ ఏమాత్రం కోలుకోలేదు. దీంతో నేతల్లో కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.
ఈ క్రమంలో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఏపీ నేతల్లో ఆశలు చిగురించేలా చేసింది. ఇంకోవైపు షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ లో చేరటం శ్రేణుల్లో మరింత జోష్ పెంచింది. ఆమె స్వయాన సీఎం జగన్ చెల్లెలు కావడంతో పార్టీకి మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. వైసీపీని వీడిన నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశిస్తున్నారు.