స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు.
“చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దు.. మెడికల్ రిపోర్టులు తప్పు.. స్కిల్ స్కాం కేసు(Skill Development Case)లో మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్లు చేతులు మారాయి. ఈ డబ్బు చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కు తరలించారు. బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్‌ల ద్వారా ఈ విషయం బయట పడింది. బోస్, కన్వేల్కర్ మెసేజ్‌ల ఆధారంగా మొత్తం డబ్బు హైదరాబాద్ చేరినట్లుగా తెలిసింది. సీమెన్స్ కంపెనీలో కుంభకోణం జరిగిందని.. నిధుల మళ్లింపు జరిగిందని నిర్ధారించారు” అని సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు వాదించారు.
“ఇప్పటికే చంద్రబాబు(Chandrababu) నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ప్రభుత్వ పెద్దలకు కాదు. అడ్వకేట్ ఎథిక్స్ విరుద్ధంగా డిల్లీలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలు ప్రచారం చేశారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును ఇరికించేందుకే ఫోరెన్సిక్ రిపోర్ట్ తయారు చేశారు. ఇప్పటికే చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స జరిగింది.. ఇందుకోసం మరింత వైద్యం చేయించుకోవాల్సి ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆయన గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు అందుకే రెగ్యులర్ బెయిల్ కోరుతున్నట్లు” చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.