వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా చంద్రబాబు(Chandrababu) తనకు టికెట్ ఇవ్వడం లేదంటూ కేశినేని నాని(Kesineni Nani) సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో నాని మరోసారి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
“నేను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు.. పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడిని. నేను వద్దని చంద్రబాబు అనుకున్నారు. నేను అనుకోలేదు. నా మీద, విజయవాడ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పాను. నేనేం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. పదేళ్లుగా విజయవాడకు ఎంతో అభివృద్ధి చేశాను అటువంటి నేను ఖాళీగా ఉంటే అభిమానులు కార్యకర్తలు ఊరుకుంటారా. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి కదా. ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోయితే ప్రైవేట్ జెట్‌లోనైనా వెళ్లాలి కదా అంటూ” వ్యాఖ్యానించారు.
“2024 మే వరకూ నేనే విజయవాడ ఎంపీని. నా రాజకీయ భవిష్యత్తు ఏంటో విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారు. గొడవలు పడటం నా నైజం కాదు, అంతమాత్రాన అది చేతకానితనం కాదు. తిరువూరు సభ గొడవ లేకుండా జరగాలనే దూరంగా ఉండాలనుకున్నా. లోకేష్ యువగళం పాదయాత్ర విజయవాడలో ప్రశాంతంగా సాగాలనే నేను దూరంగా ఉన్నా’’ అని నాని స్పష్టం చేశారు. మొత్తానికి టీడీపీలో కేశినేని నాని(Kesineni Nani) వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.