ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొండపి టీడీపీ ఎమ్మెల్యే(Kondapi TDP MLA) డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్‌బాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే ఆయన ఇంటి ముట్టడికి వెళ్లేందుకు పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీంతో వైసీపీ తీరుకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు కూడా టంగుటూరులోని అశోక్‌బాబు ఇంటి ముట్టడికి బయల్దేరారు. ఎమ్మెల్యే స్వామి(Kondapi TDP MLA) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు నాయుడుపాలెం నుంచి బయల్దేరగా జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ గలాటలో ఎమ్మెల్యే చొక్కా చినిగిపోయింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.