Nara Lokesh |వైసీపీ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘యువగళం పాదయాత్ర’ శనివారం 27వ రోజున తిరుపతికి చేరుకుంది. ఈ సందర్భంగా తిరుపతిలో భవన నిర్మాణ కార్మికులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం జగన్(Jagan) ప్రభుత్వం చేసిందేంటి అని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ఏ ఒక్క మంత్రి అయినా పట్టించుకున్నాడా? అని మండిపడ్డారు.
ఇసుక విధానం తీసుకొస్తానని నమ్మబలికి.. భవన నిర్మాణ కార్మికులను పొట్టన పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ఎద్దేవా చేశారు. ఇసుక అక్రమ రవాణాతో రోజుకు రూ.3 కోట్లు జగన్ రెడ్డి సంపాదిస్తున్నారని లోకేష్(Nara Lokesh) ఆరోపించారు. ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్మికుల సమస్యల గురించి ఒక్క రోజైనా మంత్రి జయరాం పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.