టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర ఘనంగా ముగిసింది. భోగాపురం మండలం పోలేపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. మంగళగిరి(Mangalagiri) నుంచి పోటీ చేయబోతున్నారా? అనే ప్రశ్నపై ఆయన మాట్లాడుతూ ” నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను… మా తాత గారు ముఖ్యమంత్రిగా చేశారు, మా నాన్న ముఖ్యమంత్రిగా చేశారు. నేను కూడా వారి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాను. మంగళగిరిలో టీడీపీ(TDP)కి పెద్దగా పట్టులేదు. గతంలో ఒకట్రెండు పర్యాయాలు మాత్రమే అక్కడ టీడీపీ జెండా ఎగిరిందన్నారు.
మంగళగిరిని టీడీపీ కంచుకోటగా చేయడం ద్వారా నాయకుడిగా తన సత్తా ఏంటో చూపించాలనుకున్నానని తెలిపారు. కానీ తాను చేసిన పొరపాటు ఏంటంటే… గత ఎన్నికల సమయంలో కేవలం 21 రోజుల ముందు మాత్రమే మంగళగిరి నియోజకవర్గానికి వచ్చానని.. దాంతో అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం సాధ్యం కాలేదన్నారు. ఒక సంవత్సరం ముందే మంగళగిరి వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొ్న్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 53 వేల ఓట్ల మెజారిటీతో మంగళగిరి ప్రజలు ఎన్నికల్లో తనను గెలిపిస్తారని లోకేష్(Nara Lokesh) ఆశాభావం ధీమా వ్యక్తం చేశారు.