మాజీ మంత్రి, సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ఆయనకు నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
“ఈ రోజు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి(YS Viveka) గారి జయంతి, అబ్బాయిలు మరిచిపోయినట్టున్నారు. వీరికి బాబాయ్ జయంతి గుర్తుండదు కానీ వర్థంతి మాత్రం డేట్, టైముతో సహా గుర్తుంటుందని సీబీఐ నిర్ధారించింది. వేటు వేసిన చేతులతోనే బాబాయ్ జయంతికి ట్వీటు వేస్తే బాగోదనేమో వేయలేదు. అబ్బాయిల వేధింపులు-కుతంత్రాలకి ఎదురొడ్డి సోదరి సునీత గారు చేస్తున్న న్యాయ పోరాటంలో తప్పక గెలుస్తారు. తన తండ్రిని చంపిన కన్నింగ్ కజిన్స్‌తో జైలు ఊచలు లెక్కపెట్టించే వరకూ విశ్రమించరు. వివేకానందరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను” అని లోకేష్ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు వివేకానందరెడ్డి 72వ జయంతి సందర్భంగా పులివెందులలో ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివేకా కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. వివేకా సమాధి వద్ద నివాళి అర్పిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు.
తన తండ్రి హత్య కేసులో విచారణ కొనసాగుతోందని, సీబీఐ అధికారుల దర్యాప్తుపై ఎలాంటి కామెంట్ చేయబోనని సునీత తెలిపారు. ఈ కేసులో తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నామని పేర్కొన్నారు. ఇంతకు మించి తాను మాట్లాడలేనని చెప్పారు. తన తండ్రి బతికి ఉంటే పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించేవారమని ఆమె వెల్లడించారు.
ఇదిలా ఉంటే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో లోకేశ్(Nara Lokesh) యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. 178వ రోజుకు చేరుకున్న పాదయాత్ర మంగళవారం ఉదయం జూలకల్లు నుంచి ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ నేతృత్వంలో లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా మోతలు, కార్యకర్తల కేరింతల నడుమ పాదయాత్ర ముందుకు సాగుతోంది. దారిపొడవునా లోకేశ్‌కు మహిళలు హారతులిస్తూ నీరాజనాలు పలుకుతున్నారు.