ఏపీ ఎన్నికల పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్ల(Janasena Star Campaigners)ను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. ఇందులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, నృత్య దర్శకుడు జానీ మాస్టర్, నటులు సాగర్, పృథ్విరాజ్, కమెడియన్లు హైపర్ ఆది, గెటప్ శ్రీనులను స్టార్ క్యాంపెయినర్లుగా నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.
అయితే ఇందులో క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) పేరు ఉండటం విశేషం. గతంలో వైసీపీలో చేరిన రాయుడు ఆ పార్టీకి 10 రోజుల్లోనే గుడ్ బై చెప్పేశారు. తర్వాత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. అయితే పార్టీలో మాత్రం చేరలేదు. ఇప్పుడు రాయుడిని స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించడంతో ఆయన మద్దతు జనసేనకు ఉన్నట్లు స్పష్టమైంది. స్టార్ క్యాంపెయినర్లు(Janasena Star Campaigners)గా నియమితులైన వారు జనసేన అభ్యర్థులు పోటీ చేసే 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో ప్రచారం నిర్వహిస్తారు.