టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో వారితో పాటు నాదెండ్ల మనోహర్, నారా లోకేష్ కూడా ఉన్నారు. వర్షాల కారణంగా పాదయాత్రకు విరామం ఇచ్చిన లోకేష్ హైదరాబాద్ వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున ఉమ్మడి కార్యచరణపై చర్చించారు. మేనిఫెస్టో ప్రకటన, సీట్ల సర్దుబాటు, తదితర అంశాలపై చర్చించనట్లుగా తెలుస్తోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ కావడం ఇది రెండో సారి. వచ్చే మూడు నెలలు ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల మధ్య అంతర్గత చర్చలు ప్రారంభమైనట్లుగా చెబుతున్నారు.
కాగా చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్నప్పుడు ఆయనతో ములాఖత్ అయి బయటకు వచ్చిన అనంతరం టీడీపీ(TDP)తో పొత్తును పవన్ కల్యాణ్(Pawan Kalyan) అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రెండు పార్టీలు సమన్వయ కమిటీలతో ముందుకు వెళ్తున్నాయి. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఇక నుంచి ఇరు పార్టీల అధినేతలు ఉమ్మడిగా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి రెడీ అయ్యారు.