ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila), వైఎస్ సునీత(YS Sunitha) లపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోల్స్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. “మహిళలను అవమానించడం, బెదిరించడం అనేవి నీచమైన, పిరికి చర్యలు. దురదృష్టవశాత్తు ఇవి బలహీనుల అత్యంత సాధారణ ఆయుధాలుగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ, నేను.. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత లకు అండగా ఉంటాము. అలాగే వారిపైన జరుగుతున్న ఈ అవమానకరమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము” అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాహుల్ గాంధీ పోస్టు పెట్టారు.
కాగా, వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని వైసీపీ(YCP) శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి ఆమె ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎండగడుతూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. డైరెక్ట్ గా జగన్ కే బాణం ఎక్కుపెట్టి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు తండ్రి వివేకా హత్య కేసులో వైసీపీ నాయకుల హస్తం ఉందంటూ ఆరోపిస్తున్న వైఎస్ సునీతకి షర్మిల మద్దతుగా నిలబడ్డారు. ఈ వ్యవహారం అంతా వైసీపీకి కొరకరాని కొయ్యగా మారింది. ఈ క్రమంలో పార్టీ సోషల్ మీడియా వైఎస్ షర్మిల, సునీత లపై ట్రోల్స్ మొదలుపెట్టారు. నువ్వసలు వైఎస్సార్ కూతురివేనా అంటూ షర్మిలని ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు ఫేస్బుక్ వేదికగా చంపేస్తామంటూ సునీతను బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ(Rahul Gandhi) వారిపై జరుగుతున్న ట్రోల్స్ ని ఖండిస్తున్నానంటూ పోస్ట్ పెట్టినట్లు స్పష్టం అవుతోంది.