Rajesh Mahasena joins TDP: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న టీడీపీ నేతలు విస్తృతంగా జనాల్లో తిరుగుతున్నారు. ఓపక్క చంద్రబాబు, మరోపక్క నారా లోకేష్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం పెద్దాపురం నియోజకవర్గంలో చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో మహాసేన రాజేశ్ టీడీపీలో చేరారు. రాజేశ్‌కు చంద్రబాబు కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఒక విలన్‌గా చూపించి, వైసీపీ జనాలను మోసం చేసిందని రాజేశ్ మండిపడ్డారు. జరిగిన తప్పును తెలుసుకుని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చేరినట్లు అభిప్రాయపడ్డారు.
ఎన్నికలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ సైనికులుగా ప్రతీ గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తామని, గతంలో చంద్రబాబు దళితుల కోసం అమలు చేసిన పథకాలను వివరిస్తామని మహాసేన రాజేశ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని లేకపోతే రాష్ట్రంసర్వనాశనం అయిపోతుందని మహాసేన రాజేశ్(Rajesh Mahasena) అభిప్రాయపడ్డారు. అయితే, ఇంతకాలం జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్న రాజేశ్.. ఉన్నపళంగా టీడీపీలో చేరడం జనసైనికులను షాక్‌కు గురిచేసింది. దీనిపై జనసేన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.