స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case)లో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చిన తర్వాతే ఈ పిటిషన్ వాదనలు వింటామని తెలిపింది. అనంతరం బెయిల్ రద్దు అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణ వరకు కేసు వివరాల గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు రాజకీయ కార్యక్రమాలకు ఆటంకాలు తొలగిపోయాయి.
కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case)లో చంద్రబాబుకు నవంబర్ 20న ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు బెయిల్ విషయంలో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొంది.