ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈనెల 17 నుంచి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, యూకే వెళ్లేందుకు అనుమతి కావాలని నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. మరోవైపు మే 13న పోలింగ్ ముగియనుండగా.. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన జగన్.. పోలింగ్ తర్వాత రిలాక్స్ అయ్యేందుకు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
కాగా అక్రమాస్తుల కేసుల్లో జగన్ బెయిల్ షరతుల్లో భాగంగా విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఇదిలా ఉంటే సీఎంగా జగన్(YS Jagan) బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగు సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. తొలిసారి కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్‌లోని జెరూసలెం పర్యటనకు వెళ్లారు. రెండో సారి కుమార్తె కాలేజీ జాయినింగ్ కోసం అమెరికా పర్యటనకు వెళ్లారు. మూడోసారి ఫ్యామిలీతో పాటు దావోస్ వెళ్లి అటు నుంచి విహారయాత్రకు వెళ్లారు. నాలుగోసారి లండన్ పర్యటనకు వెళ్లారు. ఆయన లండన్‌లో ఉన్నప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.