ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల(YS Sharmila) బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. తాను పార్టీలోకి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్ బిడ్డగా ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ లో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ(YCP), టీడీపీ(TDP) దొందు దొందే నంటూ విమర్శించారు. రెండు పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధిని మరిచి.. దోచుకో దాచుకో అనే రీతిన పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
ఆమె ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే..
ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదు. 10 ఏళ్లలో ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. రూ.3 లక్షల కోట్లకు పైగా జగన్ అప్పులు చేశారు. ఏపీపై రూ.10లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. సీఎం అయ్యాక జగన్(Jagan) ఒక్కసారైనా ప్రత్యేక హోదాపై పోరాడారా? గ్రాఫిక్స్‌లో చంద్రబాబు(Chandrababu) రాజధాని చూపెట్టారు. బీజేపీ దోస్తీ కోసం టీడీపీ, వైసీపీ పోలవరాన్ని తాకట్టు పెట్టాయి. స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది వైసీపీ. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు రాదో చూస్తాను స్పెషల్ స్టేటస్ అన్నాడు జగన్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా, ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా? కేంద్రం మెడలు వంచుతా అని చెప్పిన జగన్ తన మెడలు వంచి దండాలు పెట్టారు అంటూ సోదరుడు, సీఎం జగన్ పై వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.