ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల ‘మేమంతా సిద్ధం’ సభలో జాబు కావాలంటే జగన్ రావాలనే వ్యాఖ్యలపై ఆమె కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. ఈ ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
“జాబు కావాలంటే బాబు రావాలని చంద్రబాబు(Chandrababu) చేసిన మోసం చాలదని…జాబు రావాలంటే జగన్(YS Jagan) కావాలని ఘరానా మోసానికి తెరలేపాడు జగన్ మోహన్ రెడ్డి గారు. 2.32లక్షల ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు,23వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని గద్దెనెక్కిన మీరు.. ఈ ఐదు ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోండి. ఏటా జాబ్ క్యాలెండర్ అని..జంబో డీఎస్సీ అని..APPSC నుంచి వరుస నోటిఫికేషన్లు అని నమ్మించి నిరుద్యోగులను నిండా ముంచిన జగన్ గారు…. మోసానికే బ్రాండ్ అంబాసిడర్. మీ అవసరాల కోసం వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి 2 లక్షల ఉద్యోగాలు నింపామని చెప్పుకోవడం తప్పా…గౌరవంగా చెప్పుకొనే ఒక్క ఉద్యోగం భర్తీ చేశారా ? నేటికీ శాఖల పరిధిలో 2.25లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మీ జగన్ మార్క్ పాలన వైఫల్యానికి ఒక నిదర్శనం” షర్మిల(YS Sharmila) విమర్శించారు.