ఆకాశ ఎయిర్ పేరుతో విమాన రంగంలోకి బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అడుగుపెట్టారు. అందుకు గానూ భారత్‌లో సర్వీసులు ప్రారంభించడం కోసం 72 బోయింగ్ విమానాలను ఆర్డర్ ఇచ్చారు. ఈ మేరకు ఆమెరికాకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ నుంచి ‘737 మ్యాక్స్’ విమానాలను దిగుమతి చేసుకోనున్నారు.
బోయింగ్‌లోని రెండు వేరియంట్లు అయిన 737-8తో పాటు అధిక-సామర్థ్యం కలిగి ఉండే 737-8-200లను ఆకాశ్ ఎయిర్ ఆర్డర్ ఇచ్చిందని బోయింగ్ తెలిపింది. ఇప్పటికే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా సహా మరికొంత మంది కలిసి ఏర్పాటు చేసిన విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్’కు పౌరవిమానయాన శాఖ నుంచి ఎన్‌ఓసీ లభించింది. మరోవైపు దేశ స్టాక్ మార్కెట్ గురించి చర్చ వస్తే..రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. అంతలా ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే ఆయన్ను అందరూ ‘బిగ్బుల్’గా పిలుస్తారు.
మార్కెట్ డేటా ప్రకారం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఫినాన్స్, టెక్, రిటైల్, ఫార్మా రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెట్టారు. ట్రెండ్‌లైన్ నివేదిక ప్రకారం ఆయనకు మొత్తం 36 స్టాక్స్‌లో (కంపెనీలు) దాదాపు రూ.18,867 కోట్లు విలువైన పెట్టుబడులు ఉన్నాయి.