దీపావళికి ముందు ద్రవ్యోల్బణం భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు నవంబర్ 1 నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.268 వరకు పెంచింది. తాజా పెంపుతో దిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2000.50కు చేరింది. ఇదివరకు ఈ ధర రూ.1734గా ఉంది. అయితే, గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల ధర మాత్రం యథాతథంగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం చూపుతాయి. ఎల్పీజీ ధరలను క్రమంగా పెంచుతూ వాటిపై సబ్సిడీని గత ఏడాది తొలగించింది ప్రభుత్వం. ఢిల్లీలో ఇప్పుడు సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ ధర రూ.899.50. కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.926, ముంబైలో రూ.899.50. చెన్నైలో సబ్సిడీయేతర సిలిండర్ ధర ఇప్పుడు రూ.915.50గా ఉంది.
ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఎల్‌పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.