మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఈజీగా తెలుసుకోండిలా..

Find out your PF balance easily ..

0
33

ఒకప్పుడు మన పీఎఫ్‌ (ప్రావిడెంట్‌ ఫండ్‌) ఖాతాలో ఎంత ఉన్నదో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అలాగే ఉద్యోగం మారినప్పుడల్లా అకౌంట్‌ నంబర్‌ మారుతుండేది. జీతంలో పీఎఫ్‌ కింద కత్తిరించిన మొత్తాన్ని మన అకౌంట్‌లో యాజమాన్యం జమ చేసిందో లేదో తెలిసేది కాదు. కానీ ఈపీఎఫ్‌వో సంస్థ యూనివర్సల్‌ అకౌంట్‌ నంబర్‌ (యూఏఎన్‌)ను ప్రవేశపెట్టిన తర్వాత ఉద్యోగులకు ఈ దిగులంతా దూరమైంది.

ఎన్ని కంపెనీలను మార్చినా ఉద్యోగి పీఎఫ్‌ అకౌంట్‌ మారడం లేదు. అలాగే యూఏఎన్‌ నంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేసిన తర్వాత అకౌంట్‌ను ట్రాక్‌ చేయడం చాలా సులువైంది. మన బ్యాంక్‌ ఖాతా మాదిరిగానే తరచూ పీఎఫ్‌ అకౌంట్‌లోని సొమ్ము ఎంతన్నది చూసుకోవచ్చు. బ్యాంక్‌ పాస్‌బుక్‌ తరహాలోనే పీఎఫ్‌ పాస్‌బుక్‌ వచ్చిందిప్పుడు.

పీఎఫ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడానికి  epfindia. gov. in/ site_en/index.php. అనే వెబ్‌సైట్‌. లాగిన్‌ తర్వాత అవర్‌ సర్వీసెస్‌ అనే అప్షన్‌లో ఫర్‌ ఎంప్లాయిస్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత సేవల విభాగంలో మెంబర్‌ పాస్‌బుక్‌ క్లిక్‌ చేస్తే పాస్‌బుక్‌ లోడ్‌ అవుతుంది. యూఏఎన్‌ నంబర్‌ యాక్టివేటైతే బ్యాలెన్స్‌ తెలిసిపోతుంది.

అన్నింటికన్నా సులువైన మార్గం ఎస్‌ఎంఎస్‌. స్మార్ట్‌ఫోన్‌ లేకపోయినా ఫర్వాలేదు. EPFOHO UAN ENG (చివరి మూడు అక్షరాలు మీరు ఎంచుకున్న భాషకు ప్రాతినిథ్యం వహిస్తాయి) అని 7738299899 అనే నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే చాలు. యూఏఎన్‌ నంబర్‌తో రిజిస్టరైన మొబైల్‌ నంబర్‌నే ఇందుకోసం ఉపయోగించాలి.

ఈపీఎఫ్‌వో నంబర్‌కు మిస్డ్‌కాల్‌ చేయడం ద్వారా కూడా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. 011-22901406కు మీ రిజిస్టర్డ్‌ నంబర్‌తో మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు. వెంటనే ఈపీఎఫ్‌ఓ మీకు మీ పీఎఫ్‌ ఖాతా వివరాలన్నింటినీ పంపిస్తుంది. ఈ సేవలను పొందడానికి కూడా యూఏఎన్‌ నంబర్‌తో అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌నే వాడాలి.