వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా కూడా ఎయిర్టెల్ బాటలోనే పయనించింది. మొబైల్ ఛార్జీలను భారీగా పెంచుతున్నట్లు కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
మొబైల్ కాల్స్, డేటా ప్లాన్లపై దాదాపు 20 నుంచి 25 శాతం మేర పెంపు ఉండనున్నట్లు స్పష్టం చేసింది. నవంబర్ 25 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. 28 రోజుల కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను 25.31 శాతం పెంచింది. పాత ధర రూ. 79 ఉండగా..ఇప్పుడు రూ. 99కి చేరింది.
ధరలను పెంచుతున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించిన మరుసటి రోజే వొడాఫోన్- ఐడియా కూడా రేట్లు పెంచడం గమనార్హం. వీటి బాటలోనే రిలయన్స్ జియో కూడా త్వరలో రేట్లు పెంచనుందని తెలుస్తోంది.