సికింద్రాబాద్​ అల్లర్ల కేసులో మరో ట్విస్ట్..కీలక ఆధారాలు లభ్యం

0
110

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్​ అల్లర్లు విధ్వంసం సృష్టించాయి. తాజాగా ఈ అల్లర్ల కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సుబ్బారావు పాత్రపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. విధ్వంసం సృష్టించాలన్న ప్రణాళిక, కార్యాచరణను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారనే సాక్ష్యాలనూ వారు సేకరించారు.

అసలేం జరిగిందంటే?

జూన్‌ 16న సుబ్బారావు అనుచరులతో గుంటూరు నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ సమీపంలో ఓ హోటల్‌లో దిగాడు. ముఖ్య అనుచరులు శివ, మల్లారెడ్డిలతో మాట్లాడాడు. వారి ద్వారా ఆర్మీ విద్యార్థులను రప్పించుకుని ఆ రోజు రాత్రి సమాలోచనలు జరిపాడు. మూకుమ్మడిగా రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి దాడులు చేయాలని సూచించాడు. లోటుపాట్లుంటే అప్పటికప్పుడు సరిచేసేందుకు వీలుగా అనుచరులనూ మాస్కులతో స్టేషన్‌లోకి పంపించాడు. విధ్వంసం మొదలైన కొద్దిసేపటికి గుంటూరుకు పారిపోయాడని రైల్వే పోలీసులు గుర్తించారు.

అభ్యర్థులు రూపొందించుకున్న ఎనిమిది వాట్సాప్‌ గ్రూపులకుగానూ నాలుగింటిలో సుబ్బారావు సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించారు. ఫోన్‌ నంబరు తెలుసుకున్న ఓ ఇన్‌స్పెక్టర్‌ ఆయనకు నేరుగా ఫోన్‌చేసి “సుబ్బారావ్‌ ఎక్కడున్నావ్‌” అనగానే ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేశాడు. వెంటనే అప్రమత్తమై మాస్కులతో స్టేషన్‌లోకి వెళ్లిన అనుచరులకు ఫోన్‌ చేసి పారిపోండంటూ ఆదేశాలిచ్చాడు. అనంతరం హోటల్‌ ఖాళీ చేసి గుంటూరుకు వెళ్లిపోయాడని దర్యాప్తు అధికారులు తెలుసుకున్నారు.

సుబ్బారావు తాను ఈ నెల 16న సికింద్రాబాద్‌కు వచ్చానని అంగీకరించినట్టు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి సుబ్బారావు, ఆయన అనుచరులను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారని విశ్వసనీయంగా తెలిసింది.