భారీగా పెరిగిన గృహహింస కేసులు..ఏపీ, తెలంగాణలో ఇలా..

0
44

తెలంగాణలో గృహహింస కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గృహహింస కేసులపై జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ తరఫున గౌరవ అగర్వాల్ సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు.

దీనిలో తెలంగాణలో 9,479, ఆంధ్రప్రదేశ్‌లో 7,053 గృహహింస కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. గృహ హింస కేసులపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ‘వియ్‌ ద ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో దాఖలుచేసిన అఫిడవిట్‌లో ఈ మేరకు పేర్కొన్నారు.

గృహహింస చట్టం-2005 అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి తెలంగాణలో 30,299 కేసులు దాఖలు కాగా, అందులో 20,820 విచారణ పూర్తయిందని, 9,479 పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. 2,044 కేసుల్లో అప్పీళ్లు దాఖలుకాగా, అందులో 1,597 విచారణ ముగిసిందని, 447 కేసులు ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.

ఏపీవ్యాప్తంగా 23,124 కేసులు నమోదుకాగా, అందులో 16,071 కేసుల విచారణ ముగిసింది. ఇంకో 7,053 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మరో 2,857 కేసుల్లో అప్పీళ్లు, రివిజన్‌ పిటిషన్లు దాఖలు అయ్యాయి. అందులో 2,524 పిటిషన్ల విచారణ ముగిసిందని, ఇంకా 333 పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.