Flash News : రాజు మరణంపై న్యాయ విచారణకు ఆదేశం

0
32

పసిబిడ్డపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. ఈ ఆత్మహత్యపై హైకోర్టులో దాఖలైన పిల్ పై హైకోర్టు విచారణకు స్వీకరించింది. రాజు ఆత్మహత్యపై న్యాయ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిపాపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసిన నేపథ్యంలో సర్వత్రా ఈ అంశం చర్చనీయాంశమైంది. పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజును బహిరంగంగా కాల్చి చంపాలని, బహిరంగంగా ఉరి తీయాలని రకరకాలుగా డిమాండ్లు వచ్చాయి.

అంతేకాదు రాజును ఎన్ కౌంటర్ చేయాలని కొందరు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. అంతేకాదు దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్లుగానే రాజును కూడా ఎన్ కౌంటర్ చేయాలన్నారు. కొందరైతే సజ్జనార్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించాలని కూడా డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనపై అప్రమత్తమైంది. వెయ్యి మంది పోలీసులను రంగంలోకి దింపింది. పోలీసులు హైదరాబాద్ సహా పరసర జిల్లాల్లో జల్లెడపట్టారు. అడుగడుడునా తనిఖీలు చేశారు.

ఈ పరిస్థితుల్లో తనను అయితే పోలీసులు ఎన్ కౌంటర్ చేసే ప్రమాదం ఉందన్న భయం కావొచ్చు, జనాలు కొట్టి చంపుతారన్న ఆందోళన కావొచ్చు.. మొత్తానికి రాజు రైలు కింద పడి చనిపోయాడు.

అయితే రాజు మరణంపై అనుమానాలు కూడా మొదలయ్యాయి. రాజు తల్లి సహా కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పౌర హక్కుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ పిల్ ఫైల్ చేశారు. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన హైకోర్టు న్యాయ విచారణకు ఆదేశాలిచ్చింది.  విచారణ జరిపి నివేదిక సమర్పించాలని వరంగల్ 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో సీల్డు కవర్ లో నివేదిక సమర్పించాలని కోరింది.

పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పిల్ పై శుక్రవారం హైకోర్టులో  విచారణ జరిగిన సమయంలో రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ వాదించారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఏజీ ప్రసాద్ వాదించారు. ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ వీడియా చిత్రీకరణ జరిగిందన్నారు. పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ జరిగిందని ఏజీ వెల్లడించారు. అయితే వీడియోలు రేపు రాత్రి 8 లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.