ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్(Elon Musk) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టెస్లా స్టాక్ ధరలు పెరగడంతో అతని వ్యక్తిగత నికర విలువ USD 187.1 బిలియన్లకు చేరుకొని ఎలన్ మస్క్ ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. తాజాగా.. ఒక రోజులో దాదాపు USD 2 బిలియన్లను కోల్పోయి మళ్లీ రెండవ స్థానానికి దిగొచ్చాడు. అయితే, ఫార్చ్యూన్ ప్రకారం బుధవారం టెస్లా షేర్లు 5 శాతానికి పైగా పడిపోయాయి. దీని వలన మస్క్ ఒక్క రోజులో దాదాపు USD 1.91 బిలియన్ల నికర విలువను కోల్పోయాడు. బ్లూమ్‌బెర్గ్ యొక్క బిలియనీర్స్ ఇండెక్స్ మార్చి 3వ తేదీ నాటికి ఎలోన్ మస్క్ యొక్క మొత్తం సంపద USD 176 బిలియన్లు అని వెల్లడించింది. మస్క్ పతనంతో, ఫ్రెంచ్ బిలియనీర్, ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ యొక్క CEO అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు.