మంకీపాక్స్ ప్రాణాంతకమా? కాదా?

0
34

ప్రపంచ దేశాలను మంకీ పాక్స్ పట్టి పీడిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 13 వేలకు పైగా కేసులు వెలుగు చూశాయి. రానున్న రోజుల్లో వ్యాధి ఉధృతి అధికం కానుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు భారత్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. విదేశాల నుంచి కేరళకు వచ్చిన ఇద్దరికి మంకీపాక్స్ సోకింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అయితే ఈ వ్యాధి ప్రాణాంతకమా? లేదా? అనేది తెలియక చాలామంది సతమతమవుతున్నారు.

సాధారణంగా మంకీపాక్స్‌ వ్యాధి స్వల్ప లక్షణాలు మాత్రమే కలిగి ఉంటుంది. 2 నుండి 4 వారాలలో తగ్గిపోతుంది. కానీ ఆఫ్రికన్‌ దేశాల్లో గుర్తించబడ్డ కొన్ని కేసుల్లో ఇది 10శాతం మరణాల రేటును కలిగివున్నదని వార్తలు వస్తున్నాయి. జంతువుల నుండి మనుషులకు వ్యాపించే ఏ వైరస్‌ అయిన మ్యుటేషన్లకు గురి కావడం సహజం.

మ్యుటేషన్ల ఫలితంగా వ్యాప్తి తీరు, వ్యాధి తీవ్రతలో మార్పులు జరుగుతాయి. కానీ ప్రస్తుతం విస్తరిస్తున్న మంకీపాక్స్‌ వ్యాప్తి తీరు, వ్యాధి లక్షణాల తీవ్రతలో కలిగే మార్పులు వంటి అంశాలు భవిష్యత్తులో తేటతెల్లమయిన తర్వాత కానీ శాస్త్రీయంగా ఖచ్చితమైన నిర్థారణకు రావడం సాధ్యం కాదు. అశాస్త్రీయ అంచనాలతో, పుకార్లతో భయాందోళనలకు గురి కావల్సిన అవసరం లేదు.