టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌గా డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం

0
99

టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌గా డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి వ‌ద్ద జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆయన చేత ప్ర‌మాణం చేయించారు. అనంత‌రం టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ క‌న్వీన‌ర్‌గా ఎవి.ధ‌ర్మారెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి వారి చేత ప్ర‌మాణం చేయించారు. ఆ త‌రువాత ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో జ‌రిగిన జ్యేష్టాభిషేకంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌ డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి, క‌న్వీన‌ర్‌ ఎవి.ధ‌ర్మారెడ్డికి వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అంద‌జేశారు. శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అందించారు.

ఈ సంద‌ర్భంగా ఆల‌యం వెలుప‌ల టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌ డాక్ట‌ర్ కెఎస్.జ‌వ‌హ‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ క‌లియుగ ప్ర‌త్య‌క్ష‌దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి స‌న్నిధిలో ఈవోగా ప‌నిచేసే అవ‌కాశం క‌ల్పించినందుకు ఆ స్వామికి రుణ‌ప‌డి ఉన్నాన‌ని, ప్ర‌స్తుతం స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించ‌డం స్వామివారి సంక‌ల్పమ‌ని చెప్పారు. గ‌త ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప‌దవీ కాలం ముగిసిన అనంత‌రం టిటిడి ఈవోను టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మ‌న్‌గా, అద‌న‌పు ఈవోను క‌న్వీన‌ర్‌గా నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింద‌న్నారు. గ‌త ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి భ‌క్తుల సౌక‌ర్యార్థం అనేక మంచి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌ని, మ‌రిన్ని ప్ర‌గ‌తిలో ఉన్నాయ‌ని, కొత్త బోర్డు వ‌చ్చేలోపు వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామ‌ని తెలిపారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని బ‌హుళ‌ప్ర‌చారం చేసేందుకు టిటిడి చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని, ఇక‌ముందు కూడా విస్తృతంగా ధ‌ర్మ‌ప్ర‌చారం చేస్తామ‌ని చెప్పారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవో స‌దా భార్గ‌వి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈఓ హ‌రీంద్ర‌నాథ్‌, బోర్డు సెల్ డెప్యూటీ ఈవో సుధారాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.